నా జీవితం దేశానికి అంకితం.. అరెస్ట్‌ తర్వాత కేజ్రీవాల్‌ తొలి రియాక్షన్‌

Mar 22, 2024 - 17:50
 0  5629
నా జీవితం దేశానికి అంకితం.. అరెస్ట్‌ తర్వాత కేజ్రీవాల్‌ తొలి రియాక్షన్‌

 తన జీవితం దేశానికి అంకితం - ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ చీఫ్‌ అరవింద్‌ కేజ్రీవాల్ 

      తన జీవితం దేశానికి అంకితం ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ చీఫ్‌ అరవింద్‌ కేజ్రీవాల్ అన్నారు.  కుంభకోణం కేసులో ఈడీ అరెస్ట్‌ తర్వాత ఆయన తొలిసారి మాట్లాడారు. ఎక్కడ ఉన్నా దేశం కోసం పనిచేస్తుంటానని పేర్కొన్నారు.

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు కేజ్రీవాల్‌ను గురువారం రాత్రి అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం ఆయన్ని ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఆ సమయంలో కేజ్రీవాల్‌ కోర్టు లోపలికి వెళ్తూ.. ‘నా జీవితం దేశానికి అంకితం. లోపల ఉన్నా బయట ఉన్నా దేశం కోసం పనిచేస్తుంటా’ అని పేర్కొన్నారు.

ఆయనే కింగ్‌పిన్‌.. కేజ్రీ పాత్రను కోర్టుకు వివరించిన ఈడీ

మరోవైపు కేజ్రీవాల్‌ను ఈడీ పది రోజుల కస్టడీకి కోరింది. ఈ మేరకు మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్‌ పాత్రపై కోర్టుకు వివరించింది. 28 పేజీల రిమాండ్‌ రిపోర్ట్‌ను ఈడీ కోర్టు ముందు ఉంచింది. సొలిసిటర్‌ జనరల్‌ ఎస్వీ రాజు ఈడీ తరఫున వాదనలు వినిపిస్తున్నారు. ఈ కేసులో కేజ్రీవాల్‌ కింగ్‌పిన్‌  అని, మద్యం పాలసీ అమలులో ఆయన ప్రత్యక్షంగా పాల్గొన్నారని కోర్టుకు వివరించారు.

‘మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్‌ కింగ్‌పిన్‌. పాలసీ అమలులో ఆయన ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఇందులో సౌత్‌ గ్రూప్‌నకు అనుకూలంగా వ్యవహరించారు. ఇది రూ.వంద కోట్ల స్కామ్‌ కాదు.. రూ.600 కోట్ల స్కామ్‌. ఇందులో కేజ్రీవాల్‌కు రూ.300 కోట్లు అందాయి. పంజాబ్‌, గోవా ఎన్నికల్లో ఖర్చుపెట్టింది ఈ డబ్బే. రూ.45 కోట్లు హవాలా ద్వారా గోవాకు పంపారు. ఆప్‌, సౌత్‌ గ్రూప్‌ల మధ్య విజయ్‌నాయర్‌ వారధిగా ఉన్నాడు. విజయ్‌ నాయర్‌ కంపెనీ నుంచి అన్ని ఆధారాలూ సేకరించాం. మా దగ్గర అన్ని ఆధారాలూ ఉన్నాయి’ అని ఈడీ వివరించింది. ఈ కేసులో విచారణ నిమిత్తం కేజ్రీవాల్‌ను పది రోజులు కస్టడీకి కోరింది. ప్రస్తుతం వాదనలు కొనసాగుతున్నాయి. న్యాయమూర్తి తీర్పుపై ఉత్కంఠ కొనసాగుతోంది. విచారణ నేపథ్యంలో కోర్టు వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow