భార్య టార్చర్‌ తట్టుకోలేక.. ఎవరికీ చెప్పుకోలేక!

Mar 25, 2024 - 06:35
 0  5127
భార్య టార్చర్‌ తట్టుకోలేక.. ఎవరికీ చెప్పుకోలేక!

 ఓ వైపు తల్లి అనారోగ్యానికి గురై దవాఖానలో చికిత్స పొందుతుండగా.. మరోవైపు భార్య పుట్టింటికి వెళ్లి మరీ వేధింపులకు గురిచేస్తుండగా తట్టుకోలేక.. ఈ విషయం ఎవరికీ చెప్పుకోలేక తీవ్ర మనస్తాపానికి గురైన యువ న్యాయమూర్తి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

యువ న్యాయమూర్తి ఆత్మహత్య

గోల్నాక, మార్చి 24: ఓ వైపు తల్లి అనారోగ్యానికి గురై దవాఖానలో చికిత్స పొందుతుండగా.. మరోవైపు భార్య పుట్టింటికి వెళ్లి మరీ వేధింపులకు గురిచేస్తుండగా తట్టుకోలేక.. ఈ విషయం ఎవరికీ చెప్పుకోలేక తీవ్ర మనస్తాపానికి గురైన యువ న్యాయమూర్తి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన హైదరాబాద్‌లోని అంబర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం చోటుచేసుకున్నది.పోలీసులు, మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. బాగ్‌అంబర్‌పేట పోచమ్మబస్తీకి చెందిన అందె శ్రీశైలం కుమారుడు అందె మణికంఠ (36)కు ఏడేండ్ల క్రితం మహబూబ్‌నగర్‌కు చెందిన లావణ్యతో వివాహమైంది. వీరికి ఐదేండ్ల కుమారుడు ఉన్నాడు. నాలుగేండ్లపాటు ఆలేరు కోర్టులో జూనియర్‌ న్యాయమూర్తిగా పనిచేసిన మణికంఠ.. మూడేండ్లుగా హైదరాబాద్‌ నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లోని ఎక్సైజ్‌ స్పెషల్‌ కోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రెండేండ్ల క్రితం అక్కడే ఇందిరా శ్రీనిధి రెసిడెన్సీలో ఫ్లాటు కొనుగోలు చేసిన మణికంఠ కుటుంబంతో అక్కడే నివాసముంటున్నారు.

వీరి ఇంట్లో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. తీవ్ర అనారోగ్యం కారణంగా ఐదు రోజుల క్రితం మణికంఠ తల్లిని మలక్‌పేట యశోద దవాఖానలో చేర్పించారు. మణికంఠతో గొడవకు దిగిన భార్య లావణ్య.. కుమారుడిని తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. తండ్రితో కలిసి మణికంఠ చికిత్స పొందుతున్న తల్లిని చూసుకుంటున్నారు. భార్య రోజూ ఫోన్లుచేస్తూ వేధింపులకు గురిచేస్తున్నది.

తల్లి అనారోగ్యం ఓ వైపు, భార్య టార్చర్‌ మరోవైపు తట్టుకోలేక గౌరవప్రదమైన వృత్తిలో ఉంటూ ఈ విషయం ఎవరికీ చెప్పుకోలేక తీవ్ర మనస్తాపం చెందిన ఆయన ఆదివారం మధ్యాహ్నం తన ఫ్లాట్‌లోని బెడ్‌రూంలో చున్నీతో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. భార్య లావణ్య ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా ఎంతకీ లిఫ్ట్‌ చేయకపోవడంతో ఆమె పక్కింటి వారికి ఫోన్‌ చేసి విషయాన్ని తెలిపింది. వారి ఫిర్యాదు మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు ఫ్లాటు తలుపులు బద్దలు కొట్టి తెరిచి చూడగా మణికంఠ నిర్జీవంగా ఫ్యానుకు వేలాడుతూ కనిపించాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow