జగన్‌పై దాడి.. సీఈసీ ఆరా

Apr 15, 2024 - 05:42
 0  7
జగన్‌పై దాడి.. సీఈసీ ఆరా
  • వివరాలు అందజేయాలని ఏపీ సర్కారుకు ఆదేశం
  • ఘటనపై దర్యాప్తునకు 6 టాస్క్‌ఫోర్స్‌ బృందాలు
  • టూర్‌ మ్యాప్‌లోని సీసీటీవీ ఫుటేజీలపై ఫోకస్‌

హైదరాబాద్‌ : ఏపీ సీఎం జగన్‌పై రాయి దాడి ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం ఆరా తీసింది. వీఐపీల భద్రతలో వరుస వైఫల్యాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఏకంగా సీఎంపై దాడి జరగటం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘటనకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. రాజకీయ హింస పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఏపీకి చెందిన కొందరు పోలీస్‌ అధికారులపై సీఈసీ చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం. చిలకలూరిపేటలో జరిగిన ప్రధాని సభ, సీఎం రోడ్‌షోలో భద్రతా వైఫల్యాలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రశ్నలు సంధించింది.

ప్రధాని సభలో భద్రతా వైఫల్యంపై ఇప్పటికే ఐజీ, ఎస్పీలపై బదిలీ వేటు వేసిన సంగతి తెలిసిందే. కాగా, జగన్‌పై దాడి ఘటన దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. టాస్క్‌ఫోర్స్‌ ఆధ్వర్యంలోని 6 బృందాలకు కేసును అప్పగించారు. జగన్‌ బస్సు యాత్ర జరిగిన టూర్‌ మ్యాప్‌లో ఉన్న సీసీటీవీ ఫుటేజీలపై దర్యాప్తు బృందాలు ఫోకస్‌ చేసినట్టు సమాచారం. మరోవైపు, దాడికి ఉపయోగించిన రాయిని గుర్తించేందుకు ఘటన జరిగిన ప్రాంతాల్లో క్లూస్‌ టీమ్‌ జల్లెడ పడుతున్నది. శనివారం అర్ధరాత్రి వరకు వెతికినా రాయి దొరకలేదని సమచారం. కాగా, ఘటన నేపథ్యంలో విజయవాడ కమిషనరేట్‌ పరిధిలోని రౌడీషీటర్లు ఎక్కడ ఉన్నారనే దానిపై క్రైం పోలీసులు నివేదిక సిద్ధం చేస్తున్నారు.

ఈసీకి వైసీపీ, టీడీపీ ఫిర్యాదు

జగన్‌పై దాడి ఘటనపై వైసీపీ నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. సీఈవోతో వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మల్లాది విష్ణు తదితర నేతలు భేటీ అయ్యి.. దాడి వెనుక కుట్రకోణం ఉన్నదని ఫిర్యాదు చేశారు. కాగా, జగన్‌పై దాడిని టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. ఘటనపై సీబీఐ లేదా ఎన్‌ఐఏతో విచారణ జరిపించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ మేరకు ఈసీకి మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ లేఖ రాశారు. ఘటనకు డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి, ఇంటెలిజెన్స్‌ డీజీ సీతారామాంజనేయులు, విజయవాడ సీపీ కాంతిరాణాటాటాపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు.

వంద మీటర్ల పరిధిలో జనప్రవేశం రద్దు

రాయి దాడి నేపథ్యంలో సీఎం జగన్‌ భద్రతపై నిఘావిభాగం కీలక సూచనలు చేసింది. జగన్‌ బస్సుకు వంద మీటర్ల పరిధిలో జన ప్రవేశాన్ని నిషేధించాలని తెలిపింది. మరీ అవసరమైతేనే జగన్‌ బస్సు పరిసరాల్లోకి నేతలు, కార్యకర్తలకు అనుమతి ఇచ్చింది. క్రేన్లు, ఆర్చ్‌లు, భారీ గజమాలలను తగ్గించాలని సూచించింది. జగన్‌కు, జనానికి మధ్య గతంలో మాదిరిగా బారికేడ్లు ఉండేలా చూసుకోవాలని తెలిపింది. గుత్తిలో జగన్‌ కాన్వాయిపై చెప్పులు, ఇప్పుడు రాళ్లు విసరటంతో నిఘా విభాగం హైఅలర్ట్‌ ప్రకటించింది. సభల్లో ర్యాంప్‌ వాక్‌ చేయొద్దని గతంలోనే జగన్‌కు సూచించింది. వీలైనంత వరకు బస్సుల్లో కూర్చొనే రోడ్‌ షో చేయాలని తెలిపింది.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow