వైసీపీకి షాకిచ్చిన రాజేష్.. మున్సిపల్ వైస్ ఛైర్మన్, కౌన్సిలర్లతో కలిసి టీడీపీలో చేరిక

Mar 31, 2024 - 05:27
 0  5271
వైసీపీకి షాకిచ్చిన రాజేష్.. మున్సిపల్ వైస్ ఛైర్మన్, కౌన్సిలర్లతో కలిసి టీడీపీలో చేరిక

పల్నాడు జిల్లా చిలకలూరిపేట రాజకీయం ఆసక్తికరంగా మారింది. వైఎస్సార్‌సీపీకి స్థానికంగా ఊహించని షాక్‌ తగిలింది. అవమానభారం, అసంతృప్తితో రగిలిపోతున్న నియోజకవర్గ మాజీ సమన్వయకర్త మల్లెల రాజేష్‌నాయుడు పార్టీకి గుడ్ బై చెప్పారు. హైదరాబాద్‌ వెళ్లి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. ఆయన వెంట యడ్లపాడు జడ్పీటీసీ సభ్యుడు ముక్తా వాసు, మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ కొలిశెట్టి శ్రీనివాసరావు (6వ వార్డు), కౌన్సిలర్లు జాలాది సుబ్బారావు , షేక్‌ మౌలాలి , చెమిటిగంటి పార్వతి, తులం సుధాకర్‌, బిట్రా రాజేంద్రప్రసాద్‌ పార్టీలో చేరారు. వీరితో పాటుగా బుక్కాపురం, కొత్తపాలెం సర్పంచులు అల్లం ఆంజనేయులు, ఎం.సుబ్బారావుతో పాటుగా పలువురు వైఎస్సార్‌సీపీ ముఖ్య నేతలు టీడీపీలో చేరారు.

ఏపీ మంత్రి, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజినిని వైఎస్సార్‌సీపీ అధిష్ఠానం గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి మూడు నెలల క్రితం మార్చింది. మంత్రిని మార్చడంతో చిలకలూరిపేట నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తగా మల్లెల రాజేష్‌నాయుడును డిసెంబరు 11న నియమించారు. అప్పటి నుంచి ఆయన యాక్టివ్‌గా నియోజకవర్గంలో తిరుగుతూ అసంతృప్తి నేతలను ఒక తాటిపైకి తెచ్చారు. సామాజిక బస్సు యాత్ర, మేదరమెట్ల సిద్ధం సభకు పార్టీ శ్రేణులను తరలించారు. అనంతర పరిణామాల్లో గుంటూరు నగర మేయర్‌ కావటి మనోహర్‌నాయుడిని చిలకలూరిపేట వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తగా పార్టీ నిర్ణయించింది.

తనను మార్చడం వెనుక మంత్రి రజని హస్తం ఉందని గ్రహించిన రాజేష్‌నాయుడు ఆరోపణలు చేశారు. మున్సిపల్‌ ఛైర్మన్‌ పదవి ఇస్తామని ప్రస్తుత వైస్‌ ఛైర్మన్‌ కొలిశెట్టి శ్రీనివాసరావు వద్ద మంత్రి రూ.6.5 కోట్లు తీసుకుని రూ.3 కోట్లు మాత్రమే వెనక్కి ఇచ్చారని.. తన దగ్గర రూ.6.5 కోట్లు తీసుకుని మోసం చేశారని ఆరోపించారు. అనంతరం పరిణామాల్లోనే చిలకలూరిపేట వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా మనోహర్‌నాయుడును ప్రకటించారు. అప్పటి నుంచి చిలకలూరిపేటలో మౌనంగా ఉన్న రాజేష్‌నాయుడు, అనుచరులు, సన్నిహితులతో చర్చల తర్వాత కీలక నిర్ణయం తీసుకున్నారు.. టీడీపీలో చేరారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow